ఆకు చాటున దాక్కున్న విరజాజి సౌరభం దాన్ని ప్రపంచానికి చాటుతుంది. అదృష్టం ఏ మూల నుంచైనా తలుపు తట్టి పిలవటం నిజమైతే దాన్ని పదమూడేళ్ల Rita Gaviola జీవితం రుజువు చేసింది.
రీటా ఫిలిప్పీన్స్ లోని లుక్పేన్ వీధుల్లో బిచ్చగత్తె. ఆమె తండ్రి చెత్త సేకరించే ఉద్యోగి. ఇంట్లో ఐదుగురు పిల్లల్ని చూసుకోవటం లోనే ఆమె తల్లి ఓపిక అయిపోతూ ఉండేది. ఒక్క రోజు కూడా ఆ కుటుంబం లో ఎవ్వరూ కడుపునిండా తిని ఉండరు. ఆకలి భరించలేక రీటా ఆదాయం కోసం వీధుల్లో బిచ్చం ఎత్తేది.
2016 లో నిజంగానే అదృష్ట దేవత ఆమె ముందుకు వచ్చి నిలబడింది. ఫిలిప్పీన్స్ ఫోటోగ్రాఫర్ టోఫెర్ క్వింటో బర్గోస్ 2016 లో లుక్పేన్ లో జరుగుతున్న పహియన్ ఫెస్టివల్ లో ఫోటోలు తీసేందుకు వచ్చి రీటాని చూశాడు. ఆమె చాలా గ్రేస్ ఫుల్ గా ఉంది, చక్కని ఫోటో జెనిటిక్ ఫేస్ అని గుర్తించి ఆమె ఫోటోలు తీసి ఇంటర్నెట్ లో పెట్టాడు. గంటల్లో ఆమె ప్రపంచానికి తెలిసిపోయింది.
బాడ్జో తెగకు చెందిన ఆమెను బాడ్జో గర్ల్ అన్నారు నెటిజన్లు. ఆమె సౌందర్యాన్ని మిస్ వరల్డ్ ఫిలిప్పీన్స్ హిల్లరీ డేనియల్ వరుంగావో ఆకాశానికి ఎత్తేశారు. 2014 మిస్ ఇంటర్నేషనల్ బియాంకా గుడోటీ, మిస్ ఎర్త్ ఏంజెలియా ఓంగ్ లు ఆమెకు సోషల్ మీడియాలో అభినందలు చెప్పారు. అడ్వర్టైజ్ మెంట్ ఏజెన్సీల దృష్టిలో పడింది రీటా. ఎన్నో బ్రాండ్ ల మోడల్ గా పనిచేసింది. టి.వి సీరీస్ లో ఆమెకు అవకాశాలు వచ్చాయి. మన బిగ్ బాస్ వంటి బిగ్ బ్రదర్ అనే అంతర్జాతీయ షో లో పాల్గొన్న అతి చిన్న వయస్సు గల అభ్యర్థి రీటానే. దేశ విదేశాల నుంచి ఆమెకు ఆర్థిక సాయం అందింది.
2018 లో సొంత ఇల్లు కొనుక్కుంది రీటా. ఆ ఇంటిని యూట్యూబ్ లో అప్ లోడ్ చేసి తనకు ఆర్థిక సాయం అందించిన అమెరికన్ అభిమాని గ్రేస్ క్రుట్జరీ కి థాంక్స్ చెబుతూ పోస్ట్ పెట్టింది రీటా. ఆమె ఇంస్టాగ్రామ్ లో ఎంతో పాప్యులర్. లక్షల మంది ఫాలోయర్స్ తో రీటా ఇప్పుడు ప్రఖ్యాత మోడల్. ఇప్పుడు చక్కగా చదువుకుంటుంది రీటా.
సరైన సమయంలో ఫోటోగ్రాఫర్ టోఫెర్ క్వింటో తీసిన ఒక క్లిక్ ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆకలి అంటూ చేతులు చాచిన రీటా పైన ఇప్పుడు అభినందనల సుమ వర్షం కురుస్తోంది !
For more pictures, follow Rita Gaviola on her Instagram https://www.instagram.com/itsritagaviola/