ఒక వ్యక్తి ఒక మతం నుండి మరొక మతానికి మారిన కారణంగా వారి కులాన్ని మార్చడానికి వీల్లేదని మద్రాస్ హైకోర్టు, నవంబర్ 17, బుధవారం నాటి ఉత్తర్వులో తెలిపినట్లు ప్రముఖ ‘లా’ పత్రిక Live Law నివేదించింది.
షెడ్యూల్డ్ కులాలు (SC)గా వర్గీకరించబడిన హిందూ అరుంథతియార్ కమ్యూనిటీకి చెందిన జి. అముత అనే మహిళను వివాహం చేసుకున్న ఆది ద్రావిడర్ కమ్యూనిటీకి చెందిన ఎస్. పాల్ రాజ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారిస్తూ జస్టిస్ ఎస్.ఎం. సుబ్రమణ్యం తన ఉత్తర్వులు జారీ చేశారు. .
పిటిషనర్ పాల్ రాజ్ క్రైస్తవ మతంలోకి మారినప్పుడు, అతను ‘Backward Class’ (BC) కమ్యూనిటీ సర్టిఫికేట్ పొ౦ది, దాని ఆధారంగా అతను కులాంతర వివాహ ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
అయితే తమిళనాడులో, SC/ST కమ్యూనిటీకి చెందిన వ్యక్తి మరియు మరేదైనా ఇతర వర్గానికి చెందిన వారి మధ్య లేదా BC కమ్యూనిటీ సభ్యుడు మరియు మరొక వర్గానికి చెందిన వారి మధ్య జరిగే వివాహాన్ని ‘కులాంతర వివాహం’గా పరిగణిస్తారు. ఇటువంటి వివాహాల ద్వారా ఒక్కటైన ద౦పతులు, ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రాధాన్యతతో సహా అనేక సంక్షేమ ప్రయోజనాలకు అర్హులని తెలుస్తో౦ది.
పాల్ రాజ్ ద౦పతులిద్దరూ పుట్టుకతో ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వారని, సేలం జిల్లా అధికారులు ఇ౦టర్ కాస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించడంతో, రాజ్ కులాంతర వివాహ ధృవీకరణ పత్రం జారీ చేయాలని కోరుతూ మాండమస్ పిటిషన్‌ను దాఖలు చేశారు.
రిట్ ఆఫ్ మాండమస్ ( Writ of Mandamus) పిటిషన్ అ౦టే?
రిట్ ఆఫ్ మాండమస్ అనేది ఒక పబ్లిక్ అథారిటీ నిర్వహించని లేదా తిరస్కరించిన చట్టపరమైన విధులను నిర్వర్తించమని బలవంతం చేయడానికి కోర్టుచే జారీ చేయబడుతుంది.
ప్రస్తుత కేసులో, కులాంతర వివాహ ధృవీకరణ పత్రం జారీ చేయడానికి సంబంధిత అధికారులకు కోర్టు ఆదేశాలను పిటిషనర్ కోరారు.
పాల్ రాజ్ తరపు న్యాయవాది, పి. శరవణన్, 1976 డిసెంబరు 28 నాటి తమిళనాడు ప్రభుత్వ ఉత్తర్వు GOM నం. 188 ప్రకారం పిటిషనర్ వివాహాన్ని కులాంతర వివాహంగా పరిగణించాలని వాదించారు. GOM నం. 188 ఉత్తర్వు ప్రకార౦, ఒక వివాహాన్ని కులాంతర వివాహం గా పరిగణి౦చాల౦టే, భార్యాభర్తలలో ఎవరైనా ఒకరు SC/ST కమ్యూనిటీకి చెందినవారు అయ్యు౦డాలి.
అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది సి.జయప్రకాష్ వాదిస్తూ… జూలై 21, 1997న జారీ చేయబడిన సాంఘిక సంక్షేమ శాఖ లేఖ నెం. 235 ప్రకార౦, మత మార్పిడి ఫలితంగా పొందిన కమ్యూనిటీ సర్టిఫికేట్ కులాంతర వివాహ ధృవీకరణకు హామీ ఇవ్వదని పేర్కొంది అని తెలిపారు.
ఇరుపక్షాల వాదన విన్న తర్వాత, సదరు కోర్టు రిట్ పిటిషన్‌ను కొట్టివేసి, పిటిషనర్‌కు కులాంతర వివాహ ధృవీకరణ పత్రం ఇవ్వడానికి సేలం ప్రభుత్వ అధికారి నిరాకరించడాన్ని సమర్థించింది.
“పిటిషనర్ మరియు అతని భార్య ఇద్దరూ పుట్టుకతో షెడ్యూల్డ్ కులాల వర్గానికి చెందినవారైతే, కేవలం మతం మారిన కారణంగా అతను కులాంతర వివాహ ధృవీకరణ పత్రాన్ని పొందలేడు” అని జస్టిస్ సుబ్రమణ్యం తన ఉత్తర్వుల్లో రాశారు.