ప్రభుత్వ దవాఖానాల్లో కోవిడ్ చికిత్స విధానాన్ని పరిశీలించేందుకు, కరోనా పేషెంట్లకు భరోసానిచ్చేందుకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఇవాళ గాంధీ దవాఖానాను సందర్శించారు.
మధ్యాహ్నం గాంధీ కి చేరుకున్న సీఎం గంటపాటు కోవిడ్ పేషెంట్లున్న వార్డులను కలియతిరిగి వారికి అందుతున్న వైద్య చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి నీనున్నాననే భరోసాను, ధైర్యాన్నిచ్చారు.
నేరుగా కోవిడ్ పేషె౦ట్లతో మాట్లాడిన సీఎ౦
గాంధీలో కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్న ఐసియు, ఎమర్జెన్సీ, ఔట్ పేషెంట్ వార్డులు సహా, పలు జనరల్ వార్డులలో సీఎం కలియతిరిగారు. బెడ్ల వద్దకు వెళ్లి అందరి పేషెంట్లతో నేరుగా మాట్లాడారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పేరు వివరాలు అడిగి తెలుసుకోని మరీ ప్రత్యేకంగా జనరల్ వార్డుల్లోకి కూడా వెళ్లి పేషెంట్లతో మాట్లాడారు. వారికి దైర్యం చెప్పారు. మీకు చికిత్స సరిగ్గా అందుతున్నదా అని అడిగి తెలుసుకున్నారు. భోజనం ఎట్లా వున్నదని అడిగారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా వైద్యాధికారులకు ఆదేశాలిస్తూ ముందుకు కదిలారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో గాంధీలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను ఈ సందర్భంగా సీఎం పరిశీలించారు. నిమిషానికి రెండు వేల లీటర్ల ఆక్సీజన్ ను తయారు చేసే ఆక్సీజన్ ప్లాంట్ ను ఇటీవలే గాంధీలో సీఎం ఆదేశాలమేరకు నెలకొల్పారు. ప్లాంట్ మొత్తం కలియతిరిగి, గాంధీ సూపరింటెండెంట్ శ్రీ రాజారావు ను ప్లాంటు పనిచేసే విధానం గురించి, ఆక్సీజన్ ప్యూరిటీ గురించి అడిగి తెలుసుకున్నారు.
కా౦ట్రాక్టు నర్సులు, జూ. డాక్టర్ల సేవ బ్రహ్మా౦డ౦
ఈ సందర్భంగా గాంధీలో వైద్య సేవలందిస్తున్న కాంట్రాక్టు నర్సులతో, జూనియర్ డాక్టర్లతో సీఎం స్వయంగా మాట్లాడారు. ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు సేవలందిస్తున్నారని వారిని అభినందించారు. వారికి ఎటువంటి ఇబ్బంది వున్నా పరిష్కరిస్తామని, ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజల కోసం నిలబడాల్సిన అవసరం యువ డాక్టర్లుగా వారి మీద వున్నదని సీఎం అన్నారు. జూనియర్ డాక్టర్లు, నర్సుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రతిపాదనలను తక్షణమే పంపాలని వైద్య అధికారులను సీఎం ఆదేశించారు.
‘‘క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా వుండి బ్రహ్మాండంగా సేవ చేస్తున్నారు. ఈ సేవలను కొనసాగించండి. మీకు ఏ సమస్యవున్నా, అవసరం వున్నా నన్ను సంప్రదించండి. నేను సంపూర్ణంగా మీకు సహకారం అందిస్తాను’’ అని సీఎం వారికి భరోసానిచ్చారు.
ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి శ్రీ ఎస్.ఎ.ఎం. రిజ్వీ, సీఎం సెక్రటరీ, కోవిడ్ ప్రత్యేక అధికారి శ్రీ రాజశేఖర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీ గంగాధర్, డిఎంఈ శ్రీ రమేశ్ రెడ్డి, గాంధీ సూపరిండెంట్ శ్రీ రాజారావు, పోలీస్ కమీషనర్ శ్రీ అంజని కుమార్ తదితరులు పాల్గొన్నారు.