ఆరు నెలల తర్వాత ప్రపంచానికి మేడిన్ తెలంగాణ వస్త్రాలు కాకతీయ టెక్స్‌టైల్ పార్క్ నుంచి అందనున్నాయి. వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ లో మరో ఆరు నెలల్లో కొరియా దేశానికి చెందిన టెక్స్‌టైల్ దిగ్గజం యంగ్వన్ తన ఫ్యాక్టరీల నిర్మాణం పూర్తి చేయనుంది. ఈరోజు మంత్రులు శ్రీ కేటీఆర్ మరియు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, పరిశ్రమల శాఖ ముఖ్య అధికారులతో కలసి యంగ్వన్ కంపెనీ చైర్మన్ కిహాక్ సుంగ్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్నారు.
Youngone Corporation చైర్మన్ కిహాక్ సుంగ్ మాట్లాడుతూ… తమ కంపెనీ వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ లో ఇప్పటికే ప్రకటించిన విధంగా తన పెట్టుబడి ప్రణాళిక కొనసాగుతుందని తెలిపారు. వరంగల్ టెక్స్‌టైల్ పార్కులో తమ కంపెనీ రానున్న ఆరు నెలల కాలంలో ఐదు ఫ్యాక్టరీలను నిర్మాణం పూర్తి చేస్తుందని, రెండవ దశలో మరో మూడు ఫ్యాక్టరీలను సైతం నిర్మించబోతున్నట్లు తెలియజేసారు. కరోనా పరిస్థితులు మరియు అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సందిగ్దత వలన గతంలో ప్రకటించిన ప్రణాళిక మేరకు ఇప్పటికే ఫ్యాక్టరీల నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా సంవత్సర కాలం పాటు ఆలస్యం అయినట్లు తెలిపారు.

అయితే ప్రస్తుత౦ అన్నీ మెరుగుపడుతున్నాయని, ఇ౦డియాలో తమ కార్యకలాపాలను తెల౦గాణా రాష్ట్ర౦ ను౦చి ప్రారంభించేందుకు క౦పెనీ సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. వరంగల్ టెక్స్‌టైల్ పార్క్ లో తమ పెట్టుబడి ప్రకటన నాటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం తమకు అన్ని విధాలుగా బాసటగా నిలుస్తూ వస్తుందని ఈ సందర్భంగా కంపెనీ తెలంగాణ ప్రభుత్వం పై ప్రశంసల జల్లు కురిపించింది.
ప్రపంచ దిగ్గజ టెక్స్‌టైల్ కంపెనీ Youngone Corporation వరంగల్ నగరంలో తమ ఫ్యాక్టరీలను త్వరలో పూర్తి చేయడం కేవలం తెలంగాణలోనే కాకుండా భారతదేశ టెక్స్‌టైల్ రంగంలోనూ ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు.
యంగ్వన్ లాంటి భారీ కంపెనీ తెలంగాణ కి వచ్చిన తర్వాత టెక్స్‌టైల్ పార్క్ లో మరిన్ని కొరియన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు.
ఈ కంపెనీ ఏర్పాటు తర్వాత 12వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్న౦దున స్థానిక వరంగల్ ప్రజలకు ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి కేటీఆర్ ని కోరారు.