Godse Statue: మహాత్మాగాంధీ హంతకుడు నాథూరామ్ గాడ్సే ను 1949లో ఉరితీసిన హర్యానాలోని అంబాలా సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చిన మట్టితో గాడ్సే విగ్రహాన్ని తయారు చేస్తామని హిందూ మహాసభ తెలిపి౦ది.
సోమవారం ( 15 నవ౦బర్) గాడ్సే వర్ధంతిని పురస్కరించుకుని హి౦దూ మహాసభ ఈ వ్యాఖ్యలు చేసింది.
“గత వారం మహాసభ కార్యకర్తలు గాడ్సే మరియు నారాయణ్ ఆప్టేలను ఉరితీసిన అంబాలా జైలు నుండి మట్టిని తీసుకువచ్చారు. ఈ మట్టితో గాడ్సే, ఆప్టే విగ్రహాల తయారీకి వినియోగిస్తాం, వాటిని గ్వాలియర్‌లోని మహాసభ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నట్టు ఆ సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ జైవీర్ భరద్వాజ్ విలేకరులకు తెలిపారు.
మీరట్ (ఉత్తరప్రదేశ్)లోని ‘బలిధాన్ ధామ్’లో మహాసభ కార్యకర్తలు గాడ్సే, ఆప్టే విగ్రహాలను సోమవారం ప్రతిష్ఠించారని ఆయన చెప్పారు.
“మేము ప్రతి రాష్ట్రంలో అటువంటి బలిదాన్ ధామ్ నిర్మిస్తాము,” అన్నారాయన.
గ్వాలియర్ జిల్లా యంత్రాంగం 2017లో గాడ్సే ప్రతిమను (ఇక్కడ మహాసభ కార్యాలయంలో ఏర్పాటు చేయబడింది) సీజ్ చేసిందని, అయితే ఇప్పటి వరకు దానిని తిరిగి ఇవ్వలేదని ఆయన అన్నారు.
దేశ విభజనకు (1947లో) కాంగ్రెస్సే కారణమని, దీని ఫలితంగా పెద్ద ఎత్తున హత్యలు జరిగాయని భరద్వాజ్ ఆరోపించారు.
ఇదిలా ఉండగా, సోమవారం ఇక్కడ హిందూ మహాసభ బహిరంగ కార్యక్రమం లేదని గ్వాలియర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ సత్యేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.
ఇప్పటి వరకు ఎలాంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని, ఆ సంస్థ కార్యకలాపాలపై పోలీసులు నిఘా ఉంచారని తెలిపారు.