Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా పేలుళ్లతో వాయుకాలుష్యం భారీగా పెరిగింది. ఢిల్లీలో బాణాసంచాపై నిషేదం విధించినా ప్రజలు పట్టించుకోలేదు. దీంతో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయిందని ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ రీసెర్చ్ అధికారులు తెలిపారు.
ప్రభుత్వ ఏజెన్సీల ప్రకారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) అనేది 0 నుంచి 50 మధ్య నమోదైతే గాలి నాణ్యత మంచి స్థాయిలో ఉన్నట్టు, అదే 51-100 మధ్య ఉంటే పర్వాలేదు… 101-200 మధ్య ఉంటే ఓ మోస్తరుగా ఉన్నట్టు.. 201-300 మధ్య గాలి నాణ్యత నమోదైతే చాలా పేలవంగా ఉందని 301-400 మధ్య ఉంటే మరి అధ్వాన్నంగా ఉందని ఇక చివరిగా 401-500 మధ్య ప్రమాదకర స్థాయిలో ఉందని గుర్తిస్తారు.
శుక్రవారం ఉదయం ఢిల్లీ యూనివర్సిటీ, పీయూఎస్‌ఏ, లోధి రోడ్, మధుర రోడ్, ఐఐటీ ఢిల్లీ, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (టెర్మినల్ 3) సహా దేశ రాజధానిలోని అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత 396, 376, 379, 398, 395, 387గా నమోదైనట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపి౦ది.
అయితే గాలి నాణ్యత రాబోయే రెండు రోజుల్లో సాధారణ స్థాయికి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.