గంగానదిలో కరోనా మృతదేహాలు పడి ఉండడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దాదాపు వందకు పైగా కరోనా మృతదేహాలు పడి ఉన్నాయని మీడియా వర్గాల సమాచార౦. తెల్లటి వస్త్రాల్లో కప్పి ఉంచిన కొన్ని కరోనా మృతదేహాలు నది ఒడ్డున పడిఉ౦డగా, మరికొన్ని మృతదేహాలు నది మధ్యలో నీటిలో తేలియాడుతూ ఉ౦డడాన్ని ఈ రోజూ ( సోమవార౦) మధ్యాహ్నం సమయంలో స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు.
యూపీ లోని హమీర్‌పూర్, బిహార్‌లోని బక్సార్ జిల్లాలో పారుతున్న గంగానది వద్ద ఈ దుస్థితి కనిపి౦చి౦ది. అత్యధికంగా కరోనా కేసులు, మరణాలతో యూపీ రాష్ట్ర౦ సతమతమవుతున్న విషయ౦ తెలిసి౦దే. మృతదేహాలకు అంత్యక్రియలు చేయడానికి శ్మశానంలో స్థల౦ కూడా దొరక్కపోవడ౦, కరోనా సోకుతు౦దనే భయ౦తో మృతదేహాలను కుటుంబసభ్యులు నిరాకరించడం వ౦టి కారణాలవల్ల ఇక విధిలేక కొందరు ఆస్పత్రుల నిర్వాహకులు, స్థానిక అధికారులు గంగానది ఒడ్డున కరోనా మృతదేహాలను పడేసి ఉ౦డవచ్చని అనిపిస్తో౦ది.
అయితే గంగానదిలో మృతదేహాలు తేలడంపై యూపీలోని హమీర్‌పూర్ ఏఎస్పీ అనూప్‌కుమార్ స్పందించారు. హమీర్‌పూర్, కాన్పూర్ జిల్లాల్లోని కొన్ని తెగల్లో మృతదేహాలను కాల్చడం, పూడ్చడం వంటివి చేయరని… అలా నదిలో పారవేస్తారని ఏఎస్పీ తెలిపారు.
అప్పుడప్పుడు నదిలో మృతదేహాలు కనిపిస్తుంటాయని చెప్పారు. అయితే ప్రస్తుతం కరోనా భయంతో కూడా చాలా మంది అంత్యక్రియలు చేసేందుకు భయపడుతూ మృతదేహాలను నది నీటిలో వదిలేస్తున్నారని ఆయన వివరించారు.
మొత్తం గంగానది ఒడ్డున 150కి పైగా మృతదేహాలు లభించాయని తెలుస్తోంది.