తమిళనాడులో ఇ౦డియన్ ఆర్మీకి చె౦దిన ఎ౦ఐ-17 హెలికాప్టర్ కూలిపోయి౦ది. ఈ చాపర్ లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్నట్లు తెలుస్తో౦ది. ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. తమిళనాడులోని కూనూరు వెల్లింగ్టన్ బేస్‌లో బుధవారం ఈ ప్రమాదం జరిగి౦ది.
ప్రమాదానికి గురైన ఈ చాపర్, 4వేల పేలోడ్ తీసుకెళ్లే సామార్థ్యం ఉన్న డబుల్ ఇంజన్ హెలికాప్టర్. దీనిలో 24 మంది ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఇక ప్రమాదం సమయంలో హెలికాప్టర్‌లో 14 మంది ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందినట్లు సమాచారం.
సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో పాటు బ్రిగేడియర్ లిద్దర్, కల్నల్ హర్జిందర్ సింగ్, పీఎస్‌ఓలు గురుసేవక్ సింగ్, జితేంద్రకుమార్, వివేక్ కుమార్, సాయితేజ్, సత్‌పాల్ ప్రమాదానికి గురైన హెలికాప్టర్ లో ఉన్నారు.
భారత వాయుసేన ప్రమాదాన్ని అధికారంగా ధ్రువీకరించింది. విచారణకు ఆదేశించింది.
ప్రధాని సమీక్ష..
హెలికాప్టర్ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రమాద వివరాలను మోదీకి వివరించారు. రాజ్‌నాథ్ సింగ్ ప్రమాదం గురించి పార్లమెంట్‌లో ప్రకటన చేయనున్నారు.
తమిళనాడు సీఎం ఆరా…
హెలికాప్టర్ ప్రమాదంపై వార్త తెలిసిన వె౦టనే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా అధికారులను ఆదేశించారు.