మహాత్మాగాంధీ సూచన మేరకే అండమాన్ జైలులో ఉన్న హిందుత్వ ఐకాన్ వీర్ సావర్కర్ బ్రిటిష్ వారికి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశారు, అయితే స్వాతంత్ర పోరాటంలో ఆయన చేసిన కృషిని కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నవారు అవమానించారు అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.
అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో సావర్కర్‌పై పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేసారు.
సావర్కర్‌పై చాలా అబద్ధాలు వ్యాపించాయి. అతను బ్రిటిష్ ప్రభుత్వం ముందు అనేకసార్లు క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేశాడని విపరీత౦గా ప్రచార౦ జరిగి౦ది. నిజం ఏమిటంటే, అతను తన విడుదల కోసం ఈ పిటిషన్లను దాఖలు చేయలేదు. సాధారణంగా ఖైదీకి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసే హక్కు ఉంటుంది. మీరు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయాలని సావార్కర్ ను మహాత్మా గాంధీ కోరారు. గాంధీ సూచన మేరకు ఆయన క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశారు అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
దేశ సాంస్కృతిక ఐక్యతలో అతని సహకారం విస్మరించారు అని సింగ్ అన్నారు.
మీకు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ అతనిని అసభ్యంగా చూడటం సరికాదు. అతను జాతికి చేసిన సహకారాన్ని కించపరిచే విధ౦గా ఉ౦డే చర్యలను సహించము అని సింగ్ అన్నారు.
నాజీ లేదా ఫాసిస్ట్‌గా సావర్కర్ పై విమర్శలు చెయ్యడ౦ కూడా సరికాదని రక్షణ మంత్రి అన్నారు. నిజం ఏమిటంటే అతను హిందుత్వను విశ్వసించాడు, కానీ అతను వాస్తవికవాది. ఐక్యతకు సంస్కృతి యొక్క ఏకరూపత ముఖ్యం అని అతను నమ్మాడు అని సి౦గ్ అన్నారు.
అదే కార్యక్రమ౦లో పాల్గొన్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా మాట్లాడుతూ… సావర్కర్ ను తప్పుగా అర్థం చేసుకున్నారని, అయితే ఆయనలాగా భారతదేశమంతా మాట్లాడి ఉంటే, దేశం విభజనను ఎదుర్కొనేది కాదని వాదించారు.
భారతదేశంలో నివసిస్తున్న మరియు భారతదేశ విలువలను పంచుకునే వారందరూ హిందువులే అని ఆర్ఎస్ఎస్ చీఫ్ పునరుద్ఘాటించారు. పాకిస్తాన్ వెళ్ళిన ముస్లింలు అక్కడ గౌరవించబడలేదు. భారతదేశానికి చెందిన వ్యక్తి భారతదేశంలోనే ఉంటారు. దీనిని మార్చలేము అని భగవత్ అన్నారు.